Tuesday, 3 November 2026

టీ మంత్రి వర్గ ప్రక్షాళన ?

4

– మార్పులు చేర్పులు

హైదరాబాద్‌ మే 3 (జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మరోమారు ప్రక్షాళణకు గురై మార్పులు చేర్పులు  ఉంటాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మంత్రి వర్గంలోకి మాదిగల ,మ్రహిళ పాధాన్యత అంశంపై  విపక్షాల అస్త్రంగా మలుచుకోవడంపై ముఖ్యమంత్రి ప్రక్షాళనచేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.అలాగే పార్లమెంటరీ కార్యదర్శి వ్యవస్థ రద్దు కావడంతో అందులోనుంచి వీలుంటే ఇక్కరిద్దరిని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.   ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించి.. కడియం శ్రీహరికి కొత్త బాధ్యతలను కట్టబెట్టడంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం నేతల్లో.. మంత్రుల్లో అయోమయానికి గురిచేస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో కనీసం ఐదారుగురికి ఉద్వాసన తప్పదనే ప్రచారం గులాబీ దళంలో జోరుగా సాగుతోంది.

మంత్రి వర్గం కొలువుదీరిన నాటి నుంచే.. మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న నిర్ణయాలు మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే సంకేతాలు కూడా ఇస్తున్నాయి. సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ను మంత్రిగా చూస్తారని ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంత్రులుగా కొనసాగుతున్న వారిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం కూడా చర్చనీయంశంగా మారుతోంది.

ఇటీవల నిర్వహించిన ప్లీనరీలో సంబంధిత శాఖలకు చెందిన మంత్రులు ఆయా శాఖలకు చెందిన తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ, వేదికపై ఉన్న మంత్రి జోగు రామన్నకు మాత్రం ఆ అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించలేదు. హరితహారంపై చేసిన తీర్మానాన్ని ఎంపీ సీతారాం నాయక్‌ ప్రవేశపెట్టగా తుల ఉమా బలపరిచారు. ఈ అంశం చర్చనీయంశంగా మారింది. వేదికపైనే సంబంధిత మంత్రి ఉన్నా ఇతర నేతలకు అవకాశం కల్పించడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇక మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్న ముఖ్యమంత్రి కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా మంత్రులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వారికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పకపోవచ్చనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఐదుగురు మంత్రుల్లో ఇద్దరు లేదా ముగ్గురిని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే శాసనమండలి ఎన్నికలతో పాటు గ్రేటర్‌ ఎన్నికలు కూడా ఎదుర్కోవాల్సి ఉండడంతో… ఇప్పట్లో మార్పులు ఉండవని మరికొంతమంది నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *