టేకులపల్లి, జనవరి 25 (జనం సాక్షి): జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని తహసిల్దార్ కె.వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కళాశాల పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో స్థానిక ప్రభుత్వ కార్యాలయాల అధికారులు సిబ్బందితో కలిసి బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులకు డ్రాయింగ్, సింగింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారని, ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేసారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో భారతదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి,కులం, వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని కార్యాలయ సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామ్ సింగ్ ఠాకూర్ , కళాశాల, పాఠశాలల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు,మండల పరిషత్, తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




