Thursday, 5 November 2026

ట్వీట్ల యుద్ధం..!

– పోలీసుల తీరుపై మండిపడ్డ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– కాంగ్రెసోళ్ల కార్లే కనిపిస్తాయా అంటూ ఆగ్రహం
– అధికారంలోకి రాగానే ప్రతీకారం తీర్చుకుంటాం
– ధీటుగా స్పందించిన కేటీఆర్‌
– కష్టపడి పనిచేసే పోలీసుల పట్ల రాజకీయం చేయొద్దు
– అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దంటూ వ్యాఖ్య
హైదరాబాద్‌, అక్టోబర్‌25(జ‌నంసాక్షి) : సోషల్‌ విూడియా వేదికగా టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్‌ నాయకులపై వాహనాలపై దాడులు చేస్తున్నారని ఉత్తమ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆరోపించారు. కేటీఆర్‌ బంధువులు డీఐజీ ప్రభాకర్‌ రావు, పోలీస్‌ టాస్క్‌ఫోర్సు ఉన్నతాధికారి రాధాకృష్ణరావు, మరికొందరు అధికారులు కాంగ్రెస్‌ నాయకులే టార్గెట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. తనిఖీ చేయడానికి పోలీసులకు కాంగ్రెస్‌ నాయకుల కార్లు మాత్రమే కనబడతాయా అని ఉత్తమ్‌ పోలీసులను నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతికారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల సొంత విషయాల్లో అక్రమంగా చొరబడి పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉత్తమ్‌ వాపోయారు. సుహృద్భావ వాతావరణంలో ఎన్నికలు జరగాలనే నిబంధనలకు కొందరు పోలీసులు విఘాతం కలిగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని ఉత్తమ్‌ అన్నారు. దీనిపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులకు కులం రంగు అంట్టగట్టొద్దని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచి పేరుందనీ, నీచమైన మాటలతో వారికి చెడ్డపేరు ఆపాదించొద్దని హితవు పలికారు. 2014 ఎన్నికల సందర్భంలో రూ.3 కోట్లతో ఎవరి కారు పట్టుబడిందోనని ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న పోలీసులందరికీ డీజీపీ మహెందర్‌రెడ్డి బాస్‌ అని.. ఆ విషయం ఉత్తమ్‌ గుర్తు పెట్టుకుంటే మంచిదని అన్నారు. కష్టపడి పని చేస్తున్న మన రాష్ట్ర పోలీసుల పట్ల రాజకీయాలు చేయొద్దని వ్యాఖ్యానించారు.