Monday, 2 November 2026

డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి – పోసనబోయిన హుస్సేన్

హుజూర్ నగర్ జూన్ 29 (జనం సాక్షి): అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాంపురం గ్రామంలో 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిన ప్రభుత్వం కేవలం 8 ఇండ్లను మాత్రమే పూర్తి చేసింది తప్ప మిగతా ఇండ్లను అసంపూర్తిగా నిర్మించి వదిలేశారని, ఇప్పటికీ ముగ్గురు కాంట్రాక్టర్లు మారినప్పటికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి కలగజేసుకొని నిధులు మంజూరు చేసి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామని గొప్ప లు చెబుతున్న ప్రభుత్వం చిత్తశుద్ధితో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయడం లేదన్నారు. ఈ గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి ఆరు సంవత్సరాలు అవుతున్న నేటికీ పూర్తి చేయకపోవడం మూలంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని, లేనియెడల ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామల కృష్ణారెడ్డి, పంగ గోవిందు, కదిర సత్యనారాయణరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.