డబుల్ బెడ్రూం ఇళ్లను మరచిన ప్రభుత్వం-నెరవేరని పేదల సొంతింటి కల
—జిల్లా కాంగ్రెస్ నాయకులు మారిశెట్టి మల్లేష్
మోత్కూరు డిసెంబర్ 21 జనంసాక్షి : మాజీ ముఖ్యమంత్రి క్రీ.శే డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అర్హులైన నిరుపేదలను గుర్తించి పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారిశెట్టి మల్లేష్ అన్నారు. ఇండ్ల స్థలాలు ఉన్న నిరుపేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని బుధవారం అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదన్నారు. వంద ఎకరాల్లో కేసీఆర్ కు ఫాంహౌస్, ఎమ్మెల్యేలకు విలాసవంతమైన భవనాలు ఉండొచ్చు కానీ పేదలకు ఇల్లు ఉండకూడదా? అని ప్రశ్నించారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఊసే మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలను విస్మరిస్తున్న ఈ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో గద్దె దించి తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపి ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలకు ఇంకా మోసపోవద్దని రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇచ్చి పేదోడి కల నెరవేరుస్తుందన్నారు.




