Tuesday, 3 November 2026

డబ్బులతో గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు

ఓటుకు పదివేలు జమ చేస్తున్నారు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపణ

హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటుకు 10వేలు పంచుతుందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ జోస్యం చెప్పారు. ఇప్పటి నుంచే టిఆర్‌ఎస్‌ ఇలాంటి చర్యలకు పూనుకుందన్నారు. విూడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరద వచ్చిన ప్రాంతాల్లో చాలామందికి ఆర్థిక సహాయం అందించడంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందని ఆరోపించారు. వరద బాధితుల ఇల్లు కూలితే లక్ష రూపాయిలు, ఇల్లు ధ్వంసమైతే 50వేలు, ఇల్లు నీటమునిగితే 10వేల రూపాయిలు ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా చెప్పుకున్నారని.. అయితే అవన్నీ ఏ జీఓ ప్రకారం ఇస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే వరదబాధితుల డబ్బులను అధికార పార్టీవారు పంచుకుంటున్నారని అన్నారు. ఇప్పటికి నీటిలో ఉన్న ప్రాంతాలను, కూలిపోయిన ఇళ్లను తొలగించడంతో పూర్తిగా విఫలమైందని రాజాసింగ్‌ ఆరోపించారు. రూ. 10వేల రూపాయలు కేవలం టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల ఇళ్లకే వెళ్తున్నాయన్నారు. పూసల్‌ బస్తీకి చెందిన వాళ్ళు తమకు రూ.10 వేలు రాలేదని తనకు పిర్యాదు పత్రాలు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న జీఎచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్కరు కూడా టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయొద్దని నగర ప్రజలకు రాజాసింగ్‌ పిలుపునిచ్చారు. కొందరు నేతలు తనపై కావాలనే బురదజల్లి దుష్పచ్రారం చేస్తున్నారని రాజాసింగ్‌ వెల్లడించారు. అయితే ఆ నేతలు ఎవరనే విషయం చెప్పడానికి మాత్రం ఎమ్మెల్యే సాహసించలేదు.

రానున్న జీఎచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్కరు కూడా టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయొద్దన్నారు.