Monday, 2 November 2026

డబ్బులు పంచే సంస్కృతి తెచ్చింది బాబే

– ఓట్లకోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది
– 16స్థానాల్లో తెరాస అభ్యర్థుల గెలుపు ఖాయం
– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
హైదరాబాద్‌, మార్చి29(జ‌నంసాక్షి) : ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తెచ్చిందే చంద్రబాబు అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియం వద్ద మంత్రి తలసాని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు చంద్రబాబు డబ్బులు పంపాడని తలసాని ఆరోపించారు. చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నాడని అన్నారు. చంద్రబాబు నిద్రలో కూడా సీఎం కేసీఆర్‌ పేరునే కలవరిస్తున్నాడన్నారు. హైదరాబాద్‌లో తామంతా సంతోషంగా ఉన్నామని ఆంధ్రా ప్రజలే చెప్తున్నారని, కానీ అక్కడ చంద్రబాబు, పవన్‌లు మాత్రం ఆంధ్రావాళ్లను తెరాస ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి వారు ఓట్ల లబ్ధిపొందాలని చూస్తున్నారని తలసాని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీలు తోడు దొంగలని తలసాని విమర్శించారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పట్టించుకోలేదని అన్నారు. హైదరాబాద్‌ నగరం మరో 15కిలోవిూటర్లు విస్తరించే అవకాశం ఉందని, జంట నగరాల్లో మౌలిక వసతుల కల్పనపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందని, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని తలసాని తెలిపారు. హైదరాబాద్‌పై కేటీఆర్‌కు మంచి విజన్‌ ఉందని, రాబోయే కాలంలో హైదరాబాద్‌ క్లీన్‌ నగరంలో మారబోతుందని అన్నారు. ఇప్పటికే ఆమేరకు ప్రభుత్వం అంచెలంచెలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నగర పోలీసులకు దేశంలోనే మంచి పేరుందని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.