ధర్మపురి వ్యవహారాన్ని పట్టించుకోని కెసిఆర్
దూరంగా పెట్టడం ద్వారా దగ్గరకు రావద్దన్న సంకేతాలు?
పార్టీశ్రేణులకు అంతుచిక్కని అధినేత అంతరంగం
హైదరాబాద్,జూలై6(జనం సాక్షి): టిఆర్ఎస్లో ఇటీవల ప్రకంపనలు సృష్టించిన డి.శ్రీనివాస్ వ్యవహారంలో కెసిఆర్ పెద్దగా పట్టించుకోనట్లుగా ఉంటున్నారు. ఓ రకంగా డిఎస్‌ను ఇక దూరంగా పెట్టడం లేదా పొమ్మనకుండానే పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉంది. ఇప్పటి వరకు కనీసంగా డిఎస్‌తో మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే కలవాన్న సమాచారాన్ని కూడా పట్టించుకోవడం లేదు. అంటే డిఎస్‌ను ఓ రకంగా దూరం పెట్టినట్లుగానే భావించాలి. కెసిఆర్ ఎవరినైనా దూరం పెట్టాలనుకుంటే ఇలాగే వ్యవహరిస్తారు. వారిని దరిదాపుల్లోకి రాకుండా చూస్తారు. చర్చలకు, బుజ్జగింపులకు పెద్దగా తావీయరు. ఉంటే ఉండండి.. పోతే పొండన్న రీతిలోనే వ్యవహరిస్తారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకున్నా పెద్దగా పట్టించుకోరు. నష్టాన్ని మరో రకంగా పూడ్చుకోవాలిన చూస్తారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆర్. భూపతిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కె.కవిత, బి.బి.పాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆరు నెలల కిందట లేఖ రాశారు. అలాగే రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాజాగా లేఖ రాశారు. అయితే ఈ రెండు ఫిర్యాదులపైనా సీఎం కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. అంటే చర్య తీసుకోవడం లేదా పక్కకకు పెట్టడంఅన్నది పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఈ విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే కెసిఆర్ స్టయిల్ తెలిసిన వారికి మాత్రమే ఇది అర్థం కాగలదు. ఆయన దూరం పెట్టారంటే అసలు దగ్గరకు రానీయరు. ఇప్పుడు డిఎస్ విసయంలోనూ దాదాపు అదే జరుగుతోందని గమనించాలి. ఇక డిఎస్‌కు టిఆర్ఎస్లో , కెసిఆర్ వద్ద దాదాపు తలుపులు మూసుకుని పోయినట్లుగానే భావించాలి. సార్వత్రిక ఎన్నికల కోసం ప్రజాక్షేత్రంలో సర్వేలు చేస్తూనే టీఆర్ఎస్లో అంతర్గత అంశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి కేంద్రీకరించిన దశలో డిఎస్ వ్యవహారన్ని పక్కన పెట్టేశారనే భావించాలి. ఇప్పుడాయన దృష్టి అంతా రానున్న ఎన్నికల్లో పార్టీ పరిస్థితితోపాటు అభ్యర్థుల ప్రభావాన్ని, పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేయడంలో పడింది. వివిధ సర్వే సంస్థల ద్వారా చేపట్టిన సర్వేలు, పోలీసు నిఘా వర్గాలు, ఇతర మార్గాల ద్వారా నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నారు. పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి అనుకూలంగానే క్షేత్రస్థాయిలో ఓటర్లు ఉన్నట్లు పలు నివేదికలు, సర్వేలు వస్తున్నాయి. అయితే చాలా నియోజకవర్గాల్లో, అంటే దాదాపుగా రాష్ట్రంలోని మూడొంతుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పార్టీ శ్రేణులు, ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్లు వస్తున్న నివేదికలను సీఎం ప్రత్యేకంగా మదింపు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యమ్నాయా వ్యక్తులను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. గెలుపు కోసం పాతవాళ్లను వదులుకోవడానికి కూడా సిఎం కెసిఆర్ వెనకాడరు. ముందుగా పార్టీలోని పరిస్థితులపై నివేదికలను జిల్లా మంత్రులు, ముఖ్యుల ద్వారా తెప్పించుకుంటున్న కెసిఆర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా బేరీజు వేస్తున్నారు. పార్టీకి విధేయంగా ఉన్న ఎమ్మెల్యేలు, కొంత కష్టపడితే గెలుస్తారనే విశ్వాసమున్న నియోజకవర్గాల్లో ముందుగా దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తే గెలుపు సులభం అవుతుం దనే విశ్వాసమున్న నియోజకవర్గాల్లో కొంత కఠినంగా వ్యవహరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దీనికోసం పార్టీ మండలస్థాయి నేతల బలాబలాలు, శక్తి సామర్థ్యాలతోపాటు భవిష్యత్తు యోచనను జిల్లా యంత్రాంగం ద్వారా సేకరిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యేలలుగా ఎదగాలని ఉబలాట పడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి బాగా లేదనుకున్న చోట రంగంలోకి దింపే యోచన చేయవచ్చు. దీంతో స్థానికంగా పదవులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న నేతలతో చర్చించి, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతలను జిల్లా నేతలకు అప్పగించనున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి, స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారితో జిల్లా మంత్రులు, ఇతర ముఖ్యులు చర్చించాలనే యోచనలో ఉన్నారు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పించలేని వారికి మరో మార్గంలో రాజకీయంగా స్థానాన్ని కల్పిస్తామని హావిూలతో రానున్న ఎన్నికల్లో వారితో ఇబ్బందులు రాకుండా చూడాలని అనుకుంటున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే టికెట్ తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒప్పుకోని నాయకులను, ఇంకా ఏవైనా ఇతర మార్గాల్లో పార్టీకి నష్టం కలిగిస్తారనే అంచనా ఉన్న నాయకులను పార్టీ నుంచి బయటకు పంపించడానికి కూడా వెనుకాడని మనస్తత్వం కెసిఆర్‌ది. అందుకే డిఎస్ లాంటి వారితో కఠినంగానే ఉంటారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడక పోవచ్చు.
——-




