జనంసాక్షి , రామగిరి :డెంగ్యూ జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి అన్నారు. జాతీయ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని కల్వచర్ల గ్రామంలో డెంగ్యూ వ్యాధి నివారణ పై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ డెంగీ వ్యాధి దోమల వల్ల వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ దోమలు నీటిలో పెరుగుతాయని ఇవి పగలు మాత్రమే కుడతాయని తెలిపారు. మన ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పాడుబడిన ప్లాస్టిక్ వస్తువులు, ఇతర పనికిరాని వస్తువులు ఉంచినట్లయితే వర్షపు నీళ్లు, ఇతరేతర నీరు చేరి ఈ దోమలు గుడ్లు పెడతాయని ప్రతి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే దోమల నివారణకు మస్కిటో కాయిల్స్, దోమతెరల ద్వారా నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.డెంగ్యూ విషయంలో జాగ్రత్తగా ఉండాలని గ్రామం లో ప్రతి శుక్రవారం ‘ఫ్రై డే డ్రై డే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ పీ దీరజ, పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్, ఎంపిటిసి కొట్టె సందీప్, ఉప సర్పంచ్ వేము కనకయ్య, ఏఎన్ఎం లు తార, తిరుమల, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయితి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




