Wednesday, 4 November 2026

డోర్నకల్ మున్సిపాలిటీ స్థితి పరిస్థితులపై జిల్లాస్థాయి అధికారులకు,ప్రజలకు ఓ స్పష్టమైన అవగాహన ఉంది

మున్సి”పాల్టీ”

డోర్నకల్ జనవరి 10 జనం సాక్షి

డోర్నకల్ మున్సిపాలిటీ స్థితి పరిస్థితులపై జిల్లాస్థాయి అధికారులకు,ప్రజలకు ఓ స్పష్టమైన అవగాహన ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.మాటల్లోని అభివృద్ధి క్షేత్రస్థాయిలో ఉండదు అనడానికి చక్కటి ఉదాహరణనే సోమవారం మున్సిపల్ అధికారులు జరిపిన డ్రైనేజ్ ఆక్రమణల తొలగింపు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం.పట్టణంలో రోడ్లు,డ్రైనేజీల ఆక్రమణను ఉపేక్షించబోమని అధికారులు వెల్లడించిన మాటలు మరుసటి రోజు (మంగళవారం) శర మామూలుగానే పట్టణ వీధులు కనిపించడం పట్ల ప్రజలు ఒకింత అసహనానికి గురయ్యారు.మున్సిపల్ నిబంధన మేరకు రోడ్ల నిర్మాణం జరగకపోగా ఉన్నదాంట్లోనే ఇరువైపులా ఆక్రమణలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.గాంధీ బొమ్మ కూడలిలో ఇటు మసీదును అటు గుడిని అనుకొని మూలమలుపు వద్ద షాపులు ఏర్పాటుతో బస్సులు,లారీలను మలుపు తిప్పడం డ్రైవర్లకు కత్తి మీద సాముగా మారింది. అలాగే వీధులలో రోడ్లు,డ్రైనేజీలు ఆక్రమణతో దుకాణ సముదాయాల్లో కొనుగోళ్లకు వచ్చే వాహనాలు నిలుపుటకు పార్కింగ్ స్థలం లేక రోడ్లపై నిలపవలసిన పరిస్థితి.ఆక్రమణ వలన తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీల ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.ఇదే విషయమై ఓ మున్సిపల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజా ప్రతినిధుల జోక్యంతో డ్రైనేజీల ఆక్రమణ,తోపుడు పండ్లు,టీ,టిఫిన్ స్టాళ్లు తొలగింపు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్లు తెలిపారు.ఇట్టి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు.జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు.అభివృద్ధికి అందరూ సహకరించాలని పట్టణ పౌరులను ఆయన కోరారు.