రవితో సినీప్రముఖుల సంబంధాలపైవిచారిస్తున్నాం :డీసీపీ
హైదరాబాద్, ఫిబ్రవరి 25 : డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ లింకులు బయటపడుతున్నాయి. నిన్న అరెస్ట్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు సీసీఎల్ పీఆర్వో రవి పనసాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో రవి పనసాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రవి విశ్వప్రయత్నాలు చేశాడు. ఓ మంత్రి ద్వారా తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో రవి పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ కేసులో రవి పనసా అరెస్ట్‌తో సినీరంగం ఉలిక్కిపడింది. విచారణలో పలువురు సినీపెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు డ్రగ్స్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల్లో నిర్మాత సుశాంత్‌రెడ్డి, సినీ పరిశ్రమకు చెందిన మరో వ్యక్తి, నలుగురు నైజీరియన్లు ఉన్నారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిందితుల వద్ద నుంచి కొకైన్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నైజీరియన్లతో కలిసి రవి పనసా డ్రగ్స్ బిజినెస్ చేశారని వెల్లడించారు. రవితో సినీ రంగ ప్రముఖుల సంబంధాలపై విచారణ జరుపుతున్నామన్నారు. కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు.




