బెల్లంపల్లి, ఏప్రిల్ 7, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియా లో డ్రైనేజీల పూడిక తీతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరాసరి జేసీబీ తెచ్చి డ్రైనేజీ దాటడానికి వేసుకున్న కప్పులను ధ్వంసం చేసి పూడిక తీస్తున్నారు. ముందస్తుగా సమాచారం ఇస్తే స్వచ్చందంగా కప్పులను తీసి పక్కన పెట్టుకునే వారమని కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్రైనేజీ పనులు చేపట్టడం వల్ల ఆర్థికంగా నష్ట పోతున్నామని, అంతే కాకుండా నెలకు ఒకసారి అలా పూడిక తీసినా బాగుండేదని, కానీ ఆరు నెలలకు పైబడి పూడిక తీయకుండా ఒకేసారి ఇలా పూడిక తీయడం వల్ల నానా తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీల్లో తీసిన పూడిక వెంటనే తొలగించక పోవడం వల్ల దుర్గంధం వెదజల్లడంతో ఇళ్లలో ఉండలేక పోతున్నామని, అంతే కాకుండా జేసీబీ వాడటం వల్ల ఇంటి ముందు షెడ్లు కూలి పోతున్నాయని, ఇక ముందు కాల్ టెక్స్ ఏరియాలో డ్రైనేజీల్లో పూడిక తీసే ముందు సమాచారం ఇచ్చి ఆర్థిక నష్టం జరుగకుండా చూడాలని ఏరియా వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.




