ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి జాగ అప్పగింత

న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు భూమి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. పార్టీ ఆఫీస్‌ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 1100 చదరపు విూటర్ల స్థలాన్ని కేంద్రం ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఆ భూమికి సంబంధించిన పత్రాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించింది. పార్టీ ఆఫీసు భూమి పత్రాలను రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అందుకున్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ ప్రాంతానికి ప్రతీకగా హైదరాబాద్‌ హౌజ్‌ ఉండేది. ప్రతిష్టాత్మకమైన ఈ రాజ ప్రసాదం తదనంతర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్‌ హౌజ్‌ ఆనాటి చరిత్రకు ప్రతీక అయితే.. ఇప్పుడు ఏర్పాటు కానున్న టీఆర్‌ఎస్‌ భవన్‌ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఉద్యమ పోరాటానికి.. ఆక్షాంక్షల సాఫల్యానికి అది సంకేతం. దేశంలోని అనేక ప్రాంతాల్లో అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వెలిసే టీఆర్‌ఎస్‌ భవన్‌ నిలువెత్తు విజయంగా నిలిచి వారికి ఆదర్శంగా మారనున్నది. సంకల్ప శుద్ది, ఆత్మ స్థైర్యం సుదీర్ఘ పోరాటం చేసే నేర్పరితనం ఉంటే చిన్న ప్రాంతాలు కూడా ప్రాబల్య ఆధిపత్య వాదుల ఆగడాలను ధిక్కరించి గెలవచ్చనే స్పూర్తిని దేశవాసులకు అందించనున్నది.సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగానే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం నిర్మాణం కానుందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఒక్కడితో ప్రారంభమైన ఉద్యమ ప్రస్థానం నేడు ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ ఆత్మగౌరవ పతాకం ఎగురవేసే దాకా వచ్చిందన్నారు. మొక్కవోని పోరాట పటిమతో సబ్బండ వర్గాలను ఏకం చేసి, ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ అని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కొనియాడారు.