Tuesday, 3 November 2026

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం ఆఖరి రోజు కావడంతో రాజకీయ పార్టీలు తమ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి ప్రచారం చేస్తున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 నియోజక వర్గాలలో బీజేపీ రోడ్‌ షో నిర్వహించింది. అమ్‌ అద్మీ పార్టీ కూడా తమదే విజయమంటూ విశ్వాసంతో ప్రచారం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తమ బలాన్ని తక్కువగా అంచనా వేయోద్దని అంటోంది.
గత ఏడాది లోక్‌ సభ ఎన్నికల నుంచి దాదాపు వరుస విజయాల ఊపు మీద ఉన్న బీజేపీకి ఢిల్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలిచాయి. అక్కడ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో గురువారం ఆఖరు రోజు కావడంతో ప్రచారంలో అన్ని శక్తులూ ఒడ్డింది. 70 నియోజక వర్గాల్లోనూ రోడ్‌ షోల ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఎన్నికల ముందు సర్వేలు అమ్‌ అద్మీ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు వెల్లడించడంతో ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఆఖరి రోజు ప్రచారంలో ఆప్‌ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తప్పా ఏమీ సాధించలేకపోతోందని ఆప్‌ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే తమకే ఓటు వేయాలని కేజ్రీవాల్‌ కోరుతున్నారు.
ప్రధాన పోటీ బీజేపీ-అమ్‌ అద్మీ పార్టీల మధ్యే ఉన్నప్పటికీ తాము కూడా బరిలో ఉన్నామని… తమ పార్టీని తక్కువ అంచనా వేయోద్దని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న అజయ్‌ మాకెన్‌… ప్రజలు తమకు పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆప్‌ పార్టీని గాలిబుడగతో పోల్చారు. ఈ సారి ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేనని.. కనీసం 30 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *