తండాల అభివృద్ధి కి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి.
– టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ డిమాండ్.
కురవి డిసెంబర్20/జనం సాక్షి న్యూస్: రాష్ట్రంలో ఉన్న గిరిజన తండాలు, గూడేల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు తండాలకు రెవెన్యూ హోదా కల్పించి ప్రత్యేక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండల 2వ మహాసభలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నవి పెద్దవి దాదాపు 13వేల తండా, గూడే లు ఉన్నాయని తరతరాలుగా మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధిలో వెనకబాటుకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు ఇస్తున్న అరకొర గా నిధులతో తండాల అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. జనరల్ గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులను నూతనంగా ఏర్పాటైన తండాల గ్రామపంచాయతీలకు ఇవ్వడం వలన మౌలిక సదుపాయాలకు ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వివిధ గ్రామ అభివృద్ధి పథకాలకు నిధులు సరిపోకపోవడంతో తండాల గ్రామపంచాయతీ సర్పంచులు బయట నుండి అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సక్రమంగా ఇవ్వకపోవడంతో తెచ్చిన అప్పులు తట్టుకోలేక మానసిక వేదన గురై అనేకమంది గిరిజన సర్పంచ్ లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు అభివృద్ధికి నోచుకోవాలంటే వాటిని ప్రత్యేకంగా చూడాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క తండా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నిధులను ఇచ్చేలాగా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన వాటికి రెవిన్యూ హోదా ఇవ్వకపోవడంతో గ్రామంలో జరిగే భూమి లావాదేవీలకు ఇతర ఆదాయ వనరులను రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందాల గ్రామపంచాయతీలకు రెవిన్యూ హోదా కల్పించడంతోపాటు తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాటికోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రకారం తక్షణం గిరిజనులకు గిరిజన బంధు పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజన రైతులు సాగు చేస్తున్న మిర్చి పంటకు నల్లి పురుగు తెగులు సోకి తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన గిరిజన మిర్చి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్సిటీ బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ మండల మహాసభలో తెలంగాణ గిరిజన సంఘం (టీజీయ స్) కురవి మండల కార్యదర్శి మాలోత్ కిషన్ అధ్యక్షతన జరిగిన సభలో కు జిల్లా అధ్యక్షులు ఆంగోత్ వెంకన్న నాయక్, జిల్లా నాయకులు గుగులోత్ హరి నాయక్, బాణోత్ వెంకన్న,హేమానాయక్ ,బానోత్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు




