ఆరబెట్టి తీసుకుని రావాలని సూచన
హైదరాబాద్,ఏప్రిల్22(జనంసాక్షి): అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ భరోసా ఇచ్చారు. భయాందోళనతో తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొని మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ధాన్యం తడిసిందని.. వర్షాలు పడుతున్నాయన్న కారణాలతో రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొంటున్నట్లువెల్లడించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకుని రావాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూడాల్సిన
అవసరం లేకుండా కూపన్ సిస్టం ద్వారా కొనుగోలు చేస్తున్నాంమన్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు, అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు. మార్కెట్లలో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైతే అప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ధాన్యానికి సరిపోయే గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని,కేంద్ర ప్రభుత్వం, జూట్ మిల్ అసోసియేషన్ వీటిని సరఫరా చేస్తున్నాయి. కొన్ని కేంద్రాల వద్ద తక్కువగా ఉంటే పక్కన ఉన్న సెంటర్లు, లేదా జిల్లా కేంద్రాల నుంచి ముందుగానే పంపించే ఏర్పాటు చేస్తున్నాం. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ. 1,770, సాధారణ రకానికి రూ.1,750 మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వివరించారు. ఇదిలావుంటే వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు ఒకే గొడుగు కిందకు రావడం వల్ల పనులు వేగంగా, సులువుగా జరుగుతున్నాయని, అంతా సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు వెట్టడించారు. దీంతో కొనుగోళ్ల పక్రియ ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు కొనుగోలు పక్రియ ముగిసిన వెంటనే డబ్బు వారి ఖాతాల్లోకి జమచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
తడిసిన ధాన్యానికి సర్కార్ భరోసా




