జనంసాక్షి, మంథని : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ భరోసా కల్పించారు. రెండు రోజులు కురుస్తున్న అకాల వర్షాలతో మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడ, పవర్‌హౌజ్‌కాలనీల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్‌తో కలిసి ఆయన పరిశీలించారు.
ఆయా కేంద్రాల్లోని తడిసిన ధాన్యం పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిన రైతులు ఆందోళన పడవద్దని ధైర్యం చెప్పారు. అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యంను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, ఇందుకు రైస్ మిల్లలు పూర్తి సహకారం అందించాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందిపెడితే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు పెద్దపల్లి జిల్లాలోని ఆరు రైస్ మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి ఇదే నిదర్శనమన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ప్రతి గింజను రైస్‌మిల్లలు కొనుగోలు చేయాల్సినబాధ్యత ఉందని, ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించేది లేదని, రైతుల పక్షాన తాము, బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అయితే కొనుగోలు, లోడింగ్ అన్‌లోడింగ్ తదితర సమస్యలపై రైతులు మిల్లర్ల వద్ద ఆందోళనలు చేస్తుంటారని, అలాంటివి ఇక నుంచి చేయవద్దని ఆయన రైతులకు సూచించారు. రైతులు ఎక్కడైతే ధాన్యం అమ్ముతారో ఆ సెంటర్ నిర్వాహకులపైనే ఒత్తితి తీసుకురావాలే తప్ప రైస్‌మిల్లుల వద్ద ఆందోళన చేయకూదన్నారు. కేంద్రాల నిర్వాహకులపై ఒత్తిడి తీసుకువస్తే వారే మిల్లర్లతో మాట్లాడుతారని, అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమస్యకు పరిష్కారం చూపుతారని ఆయన అన్నారు. రైతులకు, రైస్‌మిల్లర్‌లకు కేసీఆర్ సర్కార్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పంటను అమ్ముకోవడంలో రైతులు దిగులు పడవద్దని, దేవుడు కోపం చేసినా మనకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని, తాము అండగా ఉంటామని ఆయన ఈ సందర్బంగా రైతులకు భరోసా కల్పించారు.




