హైదరాబాద్ : ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్లభరణి 1980 దశకంలో రాసిన నాటికలు ప్రేక్షకాదరణ పొందాయి. 35 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నాటక ప్రియులకు అవి జ్ఞాపకాలే. నాటి సంచలన నాటికలు ‘సంగమం-రంగస్థల సంబరం 2013’ పేరిట మరోమారు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నెల 14,15 తేదీల్లో రవీంద్రభారతిలో ఈ నాటికలను ప్రదర్శించనున్నట్లు నటుడు తనికెళ్లభరణి హైదరాబాద్లో తెలిపారు. తనికెళ్లభరణి నాటకోత్సవాలను సంగమం, కనకధార సంస్ధలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు తల్లావఝల సుందరంను ప్రజ్ఞాపూర్ణ పురస్కారంతో సత్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రేక్షకులు నాటకాలకు టికెట్లు కొని చూసినప్పుడు మంచి నాటకాలు వస్తాయని భరణి అభిప్రయపడ్డారు. రెండు రోజులపాటు జరిగే ఈ నాటకోత్సవాల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని ఆయన చెప్పారు.




