Tuesday, 3 November 2026

తమ నిర్బంధంలో ఉన్న జోర్డాన్‌ పైలట్‌ మువాత్‌ను.. సజీవ దహనం చేసిన ఐసీస్‌ ఉగ్రవాదులు

జోర్డాన్‌ౖ, ఫిబ్రవరి 4 : ఐసీస్‌ ఉగ్రవాదులు తమ నిర్బంధంలో ఉన్న జోర్డాన్‌ పైలట్‌ను అమానుషంగా హతమార్చారు. ఒక బోనులో బంఽధించి, పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు. ఆ సంఘటనతో పైలట్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సిరియా-ఇరాక్‌ సరిహద్దుల్లో బీభత్సం సృష్టిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసీస్‌) ఉగ్రవాదులు తాజాగా మరో ఘాతుకానికి పాల్పడ్డారు. జోర్డాన్‌ దేశస్థుడిని దారుణంగా హతమార్చారు.
ఐసీస్‌ ఉగ్రవాదుల అంతర్జాతీయ పోరాటంలో పాల్గొనడానికి పైలట్‌ మువాత్‌ సిరియా వెళ్లారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు చేపట్టిన గగన తల దాడుల్లో జోర్డాన్‌ తరఫున పాల్గొనడానికి గత ఏడాది డిసెంబర్‌లో వెళ్లారు. అయితే ఉగ్రవాదుల పట్టు ఉన్న రక్కా ప్రాంతంలో మువాత్‌ నడుపుతున్న విమానం కూలిపోయింది. ఆయన ఉగ్రవాదులకు దొరికిపోయాడు. దీంతో మువాత్‌ను ఉగ్రవాదులు హతమార్చారు.
మువాత్‌ విడుదలకు జోర్డాన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దానిపై ఐసీస్‌ కూడా స్పందించింది. 2005లో నిర్బంధించిన మహిళా ఉగ్రవాది సాజితాను విడిచిపెడితే మువాత్‌ను విడిచిపెడతామని ఐసీస్‌ డిమాండ్‌ చేసింది. అయితే మువాత్‌ సజీవంగా ఉన్నట్లు తమకు నిర్ధారించాలని జోర్డాన్‌ ప్రభుత్వం కోరింది, దానికి ఐసీస్‌ స్పందించలేదు. ఇప్పుడు మువాత్‌ను హతమార్చిన వీడియోను విడుదల చేసింది. జనవరి 3న మువాత్‌ను హతమార్చినట్లు తేలింది. హతమార్చిన నెల రోజుల తర్వాత విషయం బయటకు వెల్లడించారు.
మువాత్‌ హత్య విషయం బయటపడే సమయానికి ఆయన తండ్రి జోర్డాన్‌ రాజధాని అమాన్‌లో ఓ అధికారిక సమావేశంలో పాల్గొన్నారు. కుమారుని హత్య విషయం తెలియడంతో ఆయన ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. మువాత్‌ హత్య విషయం తెలిసే నాటికి జోర్డాన్‌ రాజు అబ్దుల్లా అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మువాత్‌ హత్యపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయన అమెరికా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఐసీస్‌ ఘాతుకాన్ని ఒబామా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *