ముంబై, ఫిబ్రవరి 4 : దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో కొద్దిపాటి లాభాలు నమోదయినా… కొద్దిసేపటికే పరిస్థితులు తలకిందులయ్యాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల్లో నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్… 20 పాయింట్ల నష్టంతో 28వేల 9వందల 80 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నిఫ్టీ కూడా సుమారు పది పాయింట్ల నష్టంతో 8వేల 7వందల 48 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. బులియన్ మార్కెట్లో స్వల్ప పెరుగుదలలు నమోదయ్యాయి. పది గ్రాముల స్టాండర్డ్ బంగారం 88 రూపాయలు పెరిగి 27వేల 5వందల 86 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి నామమాత్రంగా 33 రూపాయలు పెరిగి 38వేల 90 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. డాలర్ మారకం విలువ 61రూపాయల 66పైసల వద్ద ట్రేడ్ అయింది.




