తరుణ్ చుగ్‌తో రామారావు పటేల్ భేటీ..
– మర్యాదపూర్వకంగా కలిసిన పటేల్
– పార్టీలో చేరేందుకు ఆహ్వానం..
– మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా
నవంబర్ 20 జనం సాక్షి భైంసా రూరల్
బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ తో మాజీ డిసిసి అధ్యక్షుడు రామారావు పటేల్ ఆదివారం రోజున హైదరాబాదులో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి డిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రామారావు పటేల్‌ను బిజెపిలో చేరాలని.. బిజెపి రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో రామారావు పటేల్ శనివారం రోజున బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రోజున బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి రామారావు పటేల్.. బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ తో భేటీ అయ్యారు. బిజెపిలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ పేర్కొనడంతో.. రామారావు పటేల్ తాను చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈనెల 28న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బైంసా నుంచి బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానుంది.. అదే రోజున బైంసాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. మాజీ డిసిసి అధ్యక్షుడు తన అనుచర గణంతో బిజెపిలో చేరేందుకు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు సిద్ధం కావడం అభినందనీయమని.. బీజేపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. బైంసాలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తరుణ్ చుగ్ ఈ సందర్భంగా రామారావు పటేల్ కు సూచించారు. ఈ చేరిక సందర్భంగా రాష్ట్ర నాయకత్వాన్ని బైంసాకు పంపిస్తామని.. బిజెపి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ భేటీలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ అయనగారి భూమయ్య, ప్రముఖ న్యాయవాది బిజెపి సీనియర్ నాయకులు అంజు కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు




