– నదీ జలాల వినియోగం, మిషన్భగీరథపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్,సెప్టెంబర్ 11,(జనంసాక్షి): నదీ జలాల వినియోగంలో మంచినీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు. దీని కోసం అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటి వినియోగ మట్టాలను పాటించాలన్నారు. ప్రగతి భవన్లో మిషన్ భగీరథ, మంచి నీటి సరఫరాపై ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ అమలు కార్యక్రమంపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి ప్రతీ రోజు నిరంతరాయంగా మంచినీటి సరఫరాకోసం.. ఒకసారి మంచి నీరు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత ఒక్కరోజు కూడా నీటి సరఫరాను ఆపలేమని చెప్పారు. అందుకోసం నదీజాలలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలని సూచించారు. దీని కోసం ప్రాజెక్టుల్లో ఎండీడీఎల్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో నీరు ఉండగానే సరిపోదన్న సీఎం.. అవసరమైనప్పుడు ఆ నీటిని విడుదల చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా నీటిని నిల్వ ఉంచుకోవాలని పేర్కొన్నారు. అప్పుడు మాత్రమే అవసరమైనప్పుడు నీటిని విడుదల చేసుకుని మంచినీటి కొరత లేకుండా చూడగలమన్నారు. మిషన్ భగీరథ కోసం 30 పాయింట్లను మనం రిసోర్సులుగా పెట్టుకున్నామని తెలిపారు. ఏ రిసోర్స్ దగ్గర ఏడాదికి ఎన్ని నీళ్లు అవసరమో అంచనా వేసి అందుకు 25 శాతం అదనంగానే నీరు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. అందుకనుగుణంగా ప్రాజెక్టుల వారీగా ఆపరేషనల్ రూల్స్ రూపొందించాలని ఆదేశించారు. దీని కోసం నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. వీటిలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేసుకున్నామని వెల్లడించారు. ప్రాజెక్టుల నీటిని మంచినీటిగా వాడుకోవడం తెలంగాణలో ఒక హక్కు అని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరంతో పాటు కొత్త ప్రాజెక్టులు పూర్తయితే చాలా నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్ లాంటి సోర్సులున్నాయని తెలిపారు. కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు మిషన్ భగీరథ నీటిని అందించడానికి ప్రస్తుత సోర్సులనే వాడాలని సీఎం చెప్పారు. వాటి నుంచే నీటి సరఫరా జరగాలన్న సీఎం.. ఇందుకోసం మొదటిదశ ప్రణాళికా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలని సీఎం చెప్పారు. నీటిపారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని కేసీఆర్ ఆదేశించారు




