అనంతపురం,ఫిబ్రవరి23(జనంసాక్షి ): జిల్లాలో వేసవిలో ఏయే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందో గుర్తించాలని మంత్రి సునీత అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్దంచేయాలని అన్నారు. దీని ఆధారంగా ముఖ్యమంత్రితో మాట్లాడి నిధుల మంజూరు చేయించనున్నామని ఆమె తెలిపారు. జిల్లాలో ఈ వేసవిలో ఎక్కడా మంచినీటి సమస్య రాకుండా చర్య తీసుకుంటామని అన్నారు. మరో పది రోజుల్లోపు సమావేశం నిర్వహిస్తామని జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని రావాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీటి ఎద్దడిపై చేపట్టిన ప్రణాళికలు ఏమిటో వివరించాలని సంబంధిత అధికారులను సునీత ఆదేశించారు. మంత్రి గ్రావిూణ నీటి సరఫరా విభాగం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది అనంతపురం జిల్లాలో సగటు వర్షపాతం కన్నా తక్కువగా నమోదైంది. మునుపెన్నడూ లేనివిధంగా తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని చెరువులకు నీరు అందివ్వడంతో కొంతమేరకు భూగర్భజలాలు పెరగడంతో కొంత ఉపశమనం లభించిందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అప్పుడే నీటిఎద్దడి నెలకొందని గుర్తుచేశారు. అనంతపురం గ్రావిూణ శివారు ప్రాంతాల్లో గతంలో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి వనరులను అందించే అంశాలపై ప్రణాళికలు సిద్ధంచేయాలని కోరారు. ఇదిలావుంటే తాగునీటి కోసం కనీసం రూ.30 కోట్లు తక్షణ అవసరమని రెండు మాసాల క్రితమే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. సుమారు 400 గ్రామాల్లో నీరులేక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు కూడా ప్రభుత్వానికి నివేదించారు. వచ్చే వేసవి నాటికి మూడవ వంతు గ్రామాల్లో అంటే 750కిపైగా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని కూడా చెప్పారు. కాని ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. గత ఏడాది వేసవిలో తాగునీటిని సరఫరా చేసిన వాటికే ఇంత వరకు బిల్లులివ్వలేదు. ఈ ఏడాది తాగునీటి సమస్యను ఏ విధంగా అధిగమించాలో అధికారులకు పాలుపోవడం లేదు. ఇక పశుగ్రాసం గురించి వేరే చెప్పనక్కర్లేదు. మూగజీవాలకు మేత, నీటి సమస్య అధికంగా ఉంది. పంటల్లేకపోవడంతో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. బయటకొనుగోలు చేసి మేత సమకూర్చుందామంటే ట్రాక్టరు గడ్డి రూ.20 వేల ధర పలుకుతోంది. కట్ట రూ20 వరకు పలుకుతోంది. ఈ లెక్కన జత పశువుల మేపడానికి రోజుకు రూ.300 వరకు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చుపెట్టి వాటిని మేపే స్థోమత లేక పశువులను అమ్మే సుకుంటున్నారు. గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.




