Wednesday, 4 November 2026

తితిలీ తుపాన్‌తో కొత్త అనుభవపాఠం

 

ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపింది

ప్రజా సమస్యలకంటే పండుగలు ముఖ్యం కాదు

తుపాన్‌ బాధితులకు ఆర్థిక సాయం అందచేసిన చంద్రబాబు

శ్రీకాకుళం,నవంబర్‌5(జ‌నంసాక్షి): తితలీ తుపాను ఉద్దాన ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని ఆయన తెలిపారు. లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్‌లో సమర్థంగా పనిచేస్తామన్నారు. ప్రజలు అధైర్య పడాల్సిన పనిలేదని, ఉద్దానానికి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం హావిూ ఇచ్చారు. తితలీ తుపాను భయకరమైన వాతావరణాన్ని సృష్టించిందని, అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం తగ్గించగలిగామని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలంటే ఎక్కువగా అధికారులు సహాయ చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. మంత్రులు, అధికారుల పనితీరు అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. దసరా పండుగ తుపాను బాధితుల మధ్యే గడిపారని తెలిపారు. ప్రజా సమస్యలకంటే పండుగలు ప్రభుత్వానికి ఎక్కువ కాదు. సరైన సమయంలో సాయం అందజేస్తేనే ప్రజలకు ప్రయోజనం అన్నారు. తితలీ తుపానుతో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం అని అన్నారు. హెక్టారుకు రూ.40వేల సాయం చేస్తున్నాం. కేంద్రం సహకరించకపోయినా తుపాను బాధితులకు న్యాయం చేశాం. తప్పుడు సమాచారంతో పరిహారం కాజేయాలని చూస్తే ఖబడ్దార్‌ అని కూడా హెచ్చరించారు. ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. ఉద్దానం ప్రాంతంలో శాశ్వత గృహాలు కట్టిస్తాం. కోడి కత్తి వ్యవహారంలో ఢిల్లీలో నానా హడావుడి చేశారు. తితలీ బాధితుల సాయం కావాలని ఢిల్లీ నేతలను ఒక్క మాట అడగరు. కేంద్రానికి మానవత్వం లేదు, తుపాను బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పార్టీ ఆఫీసు శంకుస్థాపనకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు సమయం ఉంటుంది. కష్టాల్లో ఉండాల్సిన ప్రజలను చూడాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? కేంద్ర ప్రభుత్వ తీరును దేశవ్యాప్తంగా తిరిగి ఎండగడతాం’ అని చంద్రబాబు హెచ్చరించారు. తితలీ బాధితులకు 25రోజుల్లో పరిహారం అందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన నేత చంద్రబాబేనని ఎంపీ రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఉద్దానం ప్రజలకు చంద్రబాబు పునర్జన్మనిచ్చారని కొనియాడారు. తుపాను వచ్చిన కొద్దిగంటల్లోనే చంద్రబాబు పలాస వచ్చారని, 8రోజుల్లో ప్రజల కష్టాల్లో భాగస్వామి అయ్యారని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఇకపోతే టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం టెక్కలిలో తిత్లీ తుఫాను నష్ట పరిహారం చెక్కులను ఆంధప్రదేశ్‌ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు బాధితులకు పంపిణీ చేశారు. అలాగే కవిటిలో తిత్లి తుఫాన్‌ బాధితులకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బంగాళం అశోక్‌ నష్టపరిహారం చెక్కులను అందజేశారు.