Thursday, 5 November 2026

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

నేడు డి2 ప్రయోగం చేస్తున్నట్లు వెల్లడి

తిరుమల,నవంబర్‌13(జ‌నంసాక్షి): శ్రీవారిని ఇస్రో చైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామసమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పీఎస్‌ఎల్వి మార్క్‌ 3 డి 2 నమూనాను స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శివన్‌కు వేదపండితులు వేదశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. భారత దేశా కమ్యూనికేషన్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడానికి ప్రతిష్టాత్మకమైన పీఎస్‌ఎల్వి మార్క్‌ 3 డీ 2 మిషన్‌ ను వాతావరణం సహకరిస్తే బుధవారం ఉదయాన లాంచ్‌ చేయనున్నట్లు శివన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా జమ్మూకాశ్మీర్‌, నార్త్‌ ఈస్ట్‌ ప్రాంతాలలో కనెక్టివిటీ కోసం ముఖ్యంగా ఈ శాటిలైట్‌ ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. డీ 2 విజయవంతం అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగిన శాటిలైట్‌ ను అదించేందుకు వీలు ఉంటుంది అని శివన్‌ అన్నారు. దీని విజయం అనంతరం చంద్రాయన్‌ 2, గగనాయన్‌ ప్రోగ్రాం మాన్‌ మిషన్‌ ను సిద్ధం అవుతామని ఆయన పేర్కొన్నారు.