జనం సాక్షి /మండల కేంద్రమైన కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొద్దిపాటి వర్షానికే ఉరుస్తుంది. అలాగే వరండాలో వేసిన బండలు లేచిపోతున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం మండల వ్యాప్తంగా పలు పాఠశాలకు మన ఊరు – మన బడి పథకం కింద నిధులు మంజూరు చేసి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులు, ఫర్నిచర్ కొనుగోలు, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టాలని ఆదేశాలిచ్చింది. మండల కేంద్రమైన కొల్చారం లోని జిల్లా పరిషత్ పాఠశాలకు మన ఊరు మనబడి కింద నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టాడు. స్లాబు పైన సరి అయిన ఫ్లోరింగ్ చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికి గోడల వెంట తేమ వస్తుంది. అలాగే తరగతి గదిలో వేసిన షాబాద్ బండలు లేచిపోతున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ సరిగ్గా లేక పనులు నాసిరకంగా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా స్లాబ్ పైన మరోసారి ఫ్లోరింగ్ చేసి, షాబాద్ బండలు బాగు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు అన్నారు.
తూతూ మంత్రంగా మన ఊరు మన బడి ప్రభుత్వ పాఠశాలల మరమ్మత్తులు. కొద్దిపాటి వర్షానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు.




