Wednesday, 4 November 2026

తెలంగాణను ఆప్రతిష్ట పాలు చేస్తున్న కేసీఆర్.

తెలంగాణను ఆప్రతిష్ట పాలు చేస్తున్న కేసీఆర్.
-బిజెపిని ఎదుర్కొనే దమ్ము కెసీఆర్ కు ఉందా?
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 3, (జనంసాక్షి):
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నేడు అవినీతిమయంతో లిక్కర్ స్కామ్ లతో కెసిఆర్ కుటుంబం తెలంగాణను అప్రతిష్ట పాలు చేస్తుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ప్రజా గోస- బిజెపి భరోసా యాత్ర బైక్ ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ మలిదశ పోరాటం లో అమరుడైన శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమదేవి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం మా తెలంగాణా మాకు కావాలని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ను టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము టిఆర్ఎస్ పార్టీకి కెసిఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచానికే ఆయుధాలను అందించే శక్తిగా భారత్ ను నిలబెడుతున్నారని అన్నారు. యూనివర్సిటీల్లో వీసీల భర్తీ చేయలేదని, తాగడానికి నీళ్లు లేవు అని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ లు, మూడెకరాల భూమి పంపిణీ ఏమయ్యాయని ప్రశ్నించారు. దళితుల భూములు తీసుకొని కలెక్టరేట్లు, మెడికల్ కళాశాల నిర్మించారని ఆరోపించారు.భూముల కబ్జా, గుట్టలు స్వాహా, ఇసుక మాఫియా వంటి ఎన్నో దందాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబం ఇరుక్కోవడంతో ఏమి చేయాలో తోచక అయోమయంలో పడ్డాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. హరితహారం, ఈజీఎస్, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు వంటివి ఎన్నో కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతున్నా యన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా తానే చేస్తున్నట్లు కేసిఆర్ ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నారని వెల్లడించారు. 85 వేలు పోస్టులు భర్తీ చేస్తామని, 8వేలు పోస్టులు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. త్వరలో వచ్చే ఎన్నికలలో డబుల్ ఇంజన్ పాలన వస్తుందని అన్నారు. ఆ పాలనలో విద్య, వైద్యం అవినీతి రహిత ప్రభుత్వంగా ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అనంతరం పట్టణంలోని పలు కాలనీలలో బిజెపి జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెడ నూరి దిలీప్ ఆచారి,బుసిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ పార్లమెంట్ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, అసెంబ్లీ నాయకులు కొండా నాగేష్,జిల్లా ఉపాధ్యక్షులు పోల్ దాసు రాము, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదిరేపల్లి శ్రీనివాసులు, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎలిమే రాము, నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు బచ్చిరెడ్డి తాడూరు మండల అధ్యక్షులు లోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.