సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): యావత్ భారతదేశంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణలోనేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. షీ టీమ్స్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఘనతికెక్కిందని ఆయన చెప్పారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా కొనసాగుతున్నాయి.అందులో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్వహించిన సురక్ష దినోత్సవానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.అంతకు ముందు కొత్త బస్ స్టాండ్ నుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోపోలీస్ యంత్రాంగం నిర్వహించిన ర్యాలీనీ మంత్రి జగదీష్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కక్షలు కార్పణ్యాలతో తల్లడిల్లిన పల్లెల్లో శాంతి కపోతాలు ఎగురుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ ఘనత అని కొనియాడారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను తూచ తప్పకుండా పోలీస్ శాఖ అమలు పరుస్తున్నందునే తొమ్మిదేళ్లలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగ లేదన్నారు. ఫ్రాక్షన్ విలేజీల్లోనూ ప్రశాంతత ఫరీడవిల్లుతున్నదంటే ప్రజా క్షేమం మీద సీఎం కేసీఆర్ చూపుతున్న చొరవ మాత్రమేనన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అని, అది ఇప్పుడు దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కట్టడిలో ఉన్నందునే పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి 50 వేల పరిశ్రమలు నెలకొల్పారన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనను పోలీస్ శాఖ అమలు పరుస్తునందునే తెలంగాణా పోలీస్ అద్భుత విజయాలు నమోదు చేసుకుందన్నారు.సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్ , కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, డీఎస్పీలు వెంకటేశ్వర రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.




