Tuesday, 3 November 2026

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు  కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులను ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితిల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే  ఇంటర్నల్‌, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం పేర్కొంది.ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. కాగా హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పునివ్వగా అలా వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ఇప్పటికే హరియాణా, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు టెన్త్‌ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.