తెలంగాణలో 24గంటల జనతా కర్ఫ్యూ
హైదరాబాద్ : తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రేపటి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడారు. జనతా కర్ఫ్యూని 12 గంటలు కాకుండా 24 గంటలు పాటించి దేశానికే ఆదర్శంగా నిలుద్దామన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు జనతా కర్ఫ్యూను పాటిద్దామన్నారు. కరోనా వైరస్ దేశంలో ఎవరిని ఏం చేసినా తెలంగాణవాళ్లను ఏం చేయలేకపోయిందనేలా మసులుకుందామన్నారు. రాష్ట్రంలో రేపు అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే పనిచేయనున్నట్లు తెలిపారు. మిగతా వారంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. ఇది ఒక కఠిన సమయమని, సంకట స్థితి అని, స్వయం నియంత్రణ పాటించాలన్నారు. అందరం కలిసి పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. స్వీయ నియంత్రణ మనల్ని కాపాడుతదన్నారు. మన కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన ప్రపంచం కోసం అందరం కలిసి జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందామన్నారు.
ఎక్కడైతే నియంత్రణ పాటించలేదో వైరస్ అక్కడ బాగా విస్తరించిందన్నారు. ఎవరికివారే స్వీయ నియంత్రణ పాటిస్తే రాష్ర్టానికి, దేశానికి సేవ చేసినట్లేనని సీఎం అన్నారు. వైరస్ ఎక్కువగా 60 ఏండ్ల పైబడిన వాళ్లు, 10 ఏండ్ల లోపు పిల్లలకు ప్రాణాంతకంగా ఉంటున్న నేపథ్యంలో వారిని బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. ఆర్టీసీ బస్సులు రేపు వంద శాతం బంద్ పాటిస్తున్నాయన్నారు. ఎమర్జెన్సీ కోసం మాత్రం ప్రతి డిపోలో ఐదు బస్సులు, 10 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ర్టాల బస్సులను సైతం సరిహద్దులోనే ఆపివేస్తామన్నారు. మెట్రో రైళ్లు రేపు బంద్ పాటిస్తున్నట్లు అధికారులు ఇప్పటికే తెలిపారన్నారు. కాగా అత్యవసర సేవలకుగాను ఐదు రైళ్లను సిబ్బందితో సహా రెడీగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులను మూసివేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు సీఎం తెలిపారు.