హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్ వర్గాలు పంపాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రద్దయింది. ఇదిలా ఉంటే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరారు. ఇందుకు కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్, మంత్రులు కొనసాగాలని జీవో నెంబర్ 134ను సీఎస్ ఎస్కే జోషి జారీ చేశారు.
జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ్టికి ప్రభుత్వం ఏర్పడి 4సంవత్సరాల 3నెలల 4రోజులు అయింది. ఇదిలా ఉంటే, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించి అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్న కేసీఆర్ రేపు హుస్నాబాద్‌లో జరగబోయే సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. రేపు హుస్నాబాద్‌లో కేసీఆర్ ప్రసంగం ఆసాంతం ప్రభుత్వ రద్దుకు గల కారణాలు, మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించబోయే సంక్షేమ పథకాల గురించి సాగనున్నట్లు తెలిసింది.




