Tuesday, 3 November 2026

తెలంగాణ ఉద్యమ చరిత్రలో సాయి చంద్ గొంతుక అజరామరం – బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ స్పష్ఠీకరణ”

శేరిలింగంప‌ల్లి, జులై 02( జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష జనంలో బలంగా నాటుకున్న శుభ తరుణాన తన వంతు విద్యుక్తధర్మంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదటానికై ప్రజలందరి గొంతుకగా నిలిచి ఉస్మానియా యూనివర్సిటీ సహా యావత్ తెలంగాణ ప్రజల గుండె గొంతుకల్లో పాటయి నిలిచిన ఉద్యమ కళాకారుడు, తెలంగాణ ఉద్యమ గీతిక సాయిచంద్ భౌతికంగా ప్రజల మధ్య లేనప్పటికీ ఆయన ఆలపించిన పాట రూపంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్రలో అజరామరమై నిలుస్తారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాదులోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో సాయిచంద్ ది ఆ నిర్వచనీయమైన పాత్రయని, నిరంతరం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోనే కలిసి ముందుకు సాగుతూ యువతలోను, బడుగు, బలహీన వర్గాలలోను, విద్యావంతులు, మేధావులలోనూ తాను గజ్జ కట్టి ఆడిన ఆట, పాడిన పాట ఎంతో ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప లక్ష్యసాధకుడని బండి రమేష్ అభివర్ణించారు. సాయిచంద్ కలలను నిజం చేయడానికి, ఆయన ఆశయ సాధనకై ప్రతి తెలంగాణ బిడ్డ నడుం బిగించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు. సాయిచంద్ కుటుంబానికి యావత్ తెలంగాణ రాష్ట్రం బాసటగా నిలుస్తుందని, ప్రత్యేకించి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సొంత కుటుంబ సభ్యులయి ఆదుకుంటారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లికార్జున శర్మ, బాలరాజ్ ముదిరాజ్, శేఖర్ గౌడ్, రవీందర్, సత్యారెడ్డి, యూత్ విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.