హైదరాబాద్,డిసెంబర్16(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం సచివాలయంలో జరిగింది. మంగళవారం కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా సచివాలయానికి వచ్చిన మంత్రులు కేబినేట్ సమావేశానికి హాజరయ్యారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ 1953ని తెలంగాణ రాష్టాన్రికి అడాప్ట్ చేసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే కొన్ని సవరణలు చేయాలని తెలంగాణ ఉద్యోగులకు అనుకూలంగా ఉండాలని కొంతమంది మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై మళ్ళీ సమావేశం నిర్వహిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎలక్షన్ కమిషన్‌కు కేబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం పేరుతో ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎమ్మెల్యేలతో కార్పోరేషన్ పదవుల భర్తీకి మార్గం సుగమమైంది. హైదరాబాద్ అభివృద్ధి అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం





