– జాతీయ పార్టీ మార్గదర్శకాలు కాకుండా విూ సొంత ఎజెండా ఏంటంటూ ప్రశ్న
– ఇలా అయితే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని ఆగ్రహం
– వచ్చే మాసానికల్లా బూత్ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశం
– జనచైతన్య యాత్రకు స్పందనపై అమిత్ షా ఆరా
హైదరాబాద్, జులై13(జనం సాక్షి) : పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన అమిత్‌షా తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతానికి నేతలు తీసుకున్న చర్యలు వంటి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలపై షా ఆగ్రహం వెలుబుచ్చినట్లు తెలుస్తోంది. బూత్ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా, రాష్ట్ర నేతలు 12 గైడ్‌లైన్స్‌కే వాటిని ఎందుకు కుదించారని ప్రశ్నించారు. ఇచ్చిన సూచనలు పాలో కాకుండా పార్టీ బలోపేతం ఎలా అవుతుందని నేతలను అమిత్‌సా ప్రశ్నించినట్లు తెలిసింది. వచ్చే మాసాంతానికి బూత్ కమిటీల ఏర్పాటును పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను ఏ, బీ, సీ, డీలుగా విభజించాలని, ప్రతి బూత్‌లో అయిదుగురు స్మార్ట్ ఫోన్లు కలిగిన వారిని,ఐదుగరు బైక్‌లు ఉన్న కార్యకర్తలను విధిగా గుర్తించాలని సూచించారు. కాగా, పార్టీ ఇటీవల తెలంగాణవ్యాప్తంగా చేపట్టిన జనచైతన్య యాత్ర వివరాలపైనా ఆయన ఆరా తీసినట్టు సమాచారం. యాత్రకు ప్రజల నుంచి స్పందన ఏవిధంగా ఉందనే అంశాలతో పాటు, ఏయే నియోజకవర్గాల్లో సాగిందని నేతలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమిత్ షాకు వివరించారు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు. సమావేశంలో భాగంగా పరిపూర్ణా నంద స్వామిని నగర బహిష్కరణ చేసిన అంశంపై చర్చ జరిగింది.
అంతకు ముందు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నఆయనకు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు షా, అదే వేదిక విూద షాకు తలపాగా పెట్టి రాష్ట్ర పార్టీ తరఫున బీజేపీ నేతలు సత్కరించారు. అయితే ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారని అనుకున్నా కామ్ గా వెళ్లిపోవడంతో పార్టీ నేతలు నిరాశపడ్డారు. హైదరాబాద్ టూర్ లోనే సమర్థాన్ క్యాంప్ లో భాగంగా అమిత్‌సా పలువురు ప్రముఖులను కలవనున్నారు. ఈనాడు అధినేత రామోజీరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, పారిశ్రామికవేత్త శ్రీనిరాజును కలువనున్నారు
తెలంగాణ నేతలపై అమిత్ షా సీరియస్




