– మిషన్‌భగీరథ ద్వారా ప్రతిఒక్కరికి తాగునీరు
– గోపాలమిత్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అదిలాబాద్, నవంబర్19(ఆర్‌ఎన్‌ఎ) : రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ అద్భుత పథకాలను అందిస్తున్నారని, తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలం పిప్పేలకోటి గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నూతనంగా నిర్మించనున్న కల్యాణ మండపానికి భూమి పూజ చేశారు. రూ. 8 లక్షల నిధులతో నిర్మించిన గోపాల మిత్ర భవనాన్ని ప్రారంభించారు. దళిత బస్తి పథకం కింద మంజూరైన 85 మంది లబ్దిదారులకు భూపట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి స్పష్టంచేశారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు భీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి నీరు అందుతుందన్నారు. పిప్పెలకోటి ఎత్తిపోతల పథకం ద్వారా భూములు కోల్పోయిన వారికి చెక్కులు పంపిణీ చేశామన్నారు. పిప్పేలకోటి గ్రామంలో బ్రిడ్జి, రోడ్డు, ఆర్చి నిర్మాణానికి మంత్రి హావిూ ఇచ్చారు. దళిత బస్తీకింద దళితులకు భూములు అందిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, నాయకులు సత్యనారాయణ గౌడ్, రాంకిషన్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బోథ్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయి




