టిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 16 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అలంపూర్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు యస్ ఎ సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మొగిలిరావులచెర్వు, గోపాల్ దిన్నె గ్రామాలలో జోడోయాత్రలో భాగంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ రెండవసారి అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ తో పాటు మహిళలకు రూ. 500 కి గ్యాస్ సిలిండర్, నూతన గృహాలను నిర్మించుకునేందుకు రూ. 5 లక్షలు రుణాలను ఇచ్చేందుకు నూతన పథకాలను ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. అనంతరం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ కూలీలతో కలిసి కాసేపు వారితో ముచ్చటించి కూలీలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జోగుల రవి, నాయకులు పుటాన్ దొడ్డి వెంకటేష్, ప్రభాకర్, జైపాల్ రెడ్డి, భాస్కర్, ఎర్రవల్లి ఉపసర్పంచ్ పద్మావెంకటన్న తో పాటు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




