చేవెళ్ల మే 09(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ…ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి అనేకమందికి కంటి అద్దాలను అందించారని, తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారన్నారు. ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచి సామ మాణిక్య రెడ్డి, చింపుల సత్యనారాయణ రెడ్డి, మాసన్నగారి మాణిక్య రెడ్డి, మద్దెల చింటు, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




