Tuesday, 3 November 2026

తెలంగాణ వ్యాప్తంగా బడిబాట

అట్టహాసంగా ప్రారంభమైన కార్యక్రమం

తొలిరోజు సర్పంచ్‌ల సహకారం

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ బడిబాట కార్యక్రమాన్ని సోమవారం నుంచి చేపట్టారు. గతేడాది మంచి ఫలితాలు రావడంతో ఈ యేడు కూడా మరోమారు ఈ కార్యక్రమంతో పిల్లలను స్కూళ్లలో చేర్పించేందుకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామస్థాయిలో బడిబాట పట్టారు.ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదు అవుతుండటంతో విద్యాశాఖ గత కొన్నేళ్ళుగా బడిబాట పేరుతో ముందస్తు చర్యలు చేపట్టింది. బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి బడిలో చేర్పించడం, బడిఈడు కలిగి చదువుకు దూరంగా ఉన్న పిల్లలను పాఠశాలలకు రప్పించడం, సమాజ భాగస్వామ్యంతో పాఠశాలలను బలోపేతం చేయడం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ బడిబాట ముఖ్య ఉద్ధేశం. విద్యాశాఖతోపాటు ఈ సంవత్సరం ప్రత్యేకంగా సెర్ప్‌ అధికారులు సర్వే నిర్వహించారు. ఆయా శాఖలు సేకరించిన వివరాల ఆధారంగా బడిబయిట పిల్లల లేకుండా బడిబాట కార్యాక్రమాన్ని సమగ్రంగా నిర్వహించేలా ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి పాఠశాల ప్రారంభించిన రోజే పాఠ్యపుస్తకాలతో పాటుగా దుస్తులు కూడా పంపిణీ చేసేలా వేసవిలోనే దుస్తులు సరఫరా చేసింది. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరించడంతోపాటు, బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. షెడ్యూల్‌ ప్రకటారం తొలిరోజు సోమవారం 4వ తేదీన మన ఊరి బడి కార్యక్రమం నిర్వహించారు. సర్కార్‌ బడుల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ప్రోత్సహించి చైతన్యం కలిగించారు. సర్పంచ్‌తో పాటు టీచర్లు, వార్డు మెంబర్లు తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5న బాలికా విద్య, 6న సామూహిక అక్షరాభ్యాసం, 7న స్వచ్ఛ పాఠశాల, 8న బాలకార్మికుల విముక్తి పేరుతో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బడిబాట కార్యక్రమం పకడ్భందీగా అమలు చేసేందుకు గతేడాది నుంచి ప్రభుత్వం ప్రతి పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున నిధులు కేటాయిస్తోంది.బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించడం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తామని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.