తెలుగు సినిమా పరిశ్రమ సూపర్ స్టార్ ఇక లేరు!
తెలుగు నటుల్లో తరాల అంతరాలను దాటుకుని తిరుగులేని ప్రజాదరణ ఉన్న మహానటుడు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.
మామూలుగా సంపూర్ణారోగ్యంతో ఉండే కృష్ణ, కార్డియాక్ అరెస్టుతో సోమవారం హైదరాబాదులోని ప్రెవేటు ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు సినీ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది.
1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. బాల్యం నుంచి సినిమాలంటే చాలా మక్కువ ఉన్న కృష్ణను తల్లిదండ్రులు మాత్రం ఇంజినీరుగా చూడాలనుకున్నారు. తాను డిగ్రీ చదువుతుండగా.. తమ కాలేజీలో హీరో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం చూసి.. సినిమాలపై మరింత మోజు పెంచుకున్న కృష్ణ ఆ రంగంలో అడుగుపెట్టారు.
1965లో ఆయన ఇందిరను పెళ్లిచేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. రమేశ్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల ఉన్నారు. వీరిలో రమేశ్ బాబు ఇటీవల మరణించారు. భార్య ఇందిర కూడా ఇటీవల మరణించారు.