Tuesday, 3 November 2026

తొమ్మిదేళ్లలో సింగరేణి అద్భుత ప్రగతితెలంగాణ, పరిశ్రమలలో సింగరేణి దేశానికి ఆదర్శప్రాయం

.

 

 

 

 

 

తెలంగాణ రాకపూర్వంతో పోలిస్తే లాభాల్లో 421% వృద్ధి………అమ్మకాలలో 176% వృద్ధి….. ఉత్పత్తిలో 33% వృద్ధి, రవాణాలో 39% వృద్ధి……..మహారత్న కంపెనీలతో పోలిస్తే టర్నోవర్ లో రెండవ స్థానంతెలంగాణ ఏర్పాటు తర్వాతనే అద్భుత ప్రగతి…….
ముఖ్యమంత్రి ఆదేశంతో 19 వేలకు పైగా కొత్త నియామకాలు……
సింగరేణి ఉద్యోగుల్లో 45 శాతం యువకులే…..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సంస్థ ఛైర్మన్’ ఎండీ ఎన్.శ్రీధర్….
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత తొమ్మిదేళ్లలో సింగరేణి అన్ని రంగాలలో అత్యద్భుతమైన ప్రగతిని సాధించిందని, సంక్షేమంలో కూడా దేశంలో గల అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్ లో గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశంలో గతంలో ఎన్నడూ సాధించని అత్యుత్తమ వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాకపూర్వం సింగరేణి సంస్థ టర్నోవర్ 11,928 కోట్లు ఉండగా గత తొమ్మిది సంవత్సరాల్లో 176% వృద్ధితో గత ఏడాది 32వేల 978 కోట్లకు పెరిగిందని ఇంతటి వృద్ధిని దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సాధించలేదని, మహారత్న కంపెనీతో పోల్చి చూస్తే సింగరేణి ద్వితీయ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాకపూర్వం 2014లో 419 కోట్ల రూపాయల లాభాలు గడించిన సింగరేణి గత ఏడాది 421 శాతం వృద్ధితో 2,184 కోట్ల రూపాయల లాభాలను గడిచిందని, ఇది కూడా మరే ఇతర ప్రభుత్వ సంస్థ సాధించని ఘనమైన వృద్ధి అని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 33% బొగ్గు రవాణాలో 39% వృద్ధిని సాధించామని, గడచిన తొమ్మిదేళ్లలో 14 కొత్త గనులను ప్రారంభించుకున్నామని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన సంస్థ కూడా సింగరేణి సంస్థ అని వివరిస్తూ, ఇప్పటివరకు 19,463 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. వీటిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రకటించిన కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియ కింద 15,250 మంది వారసులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 4,207 మందికి ఉద్యోగాలు ఇచ్చామని. దీంతో ప్రస్తుతం సింగరేణి సంస్థలో ఉన్న ఉద్యోగులు 45 శాతం యువకులే ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సింగరేణి కార్మికులతో రెండుసార్లు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రకటించిన పలు సంక్షేమ పథకాలను సింగరేణి సంస్థ వెంటనే అమలు జరిపిందని వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కార్మికుల కోసం 2 వేల విశాలమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెంలో నిర్మించామన్నారు.
కార్మికుల సొంత ఇంటి నిర్మాణం కోసం పది లక్షల గృహ రుణం పై వడ్డీని సింగరేణి సంస్థ చెల్లిస్తోందని, ఉచిత కరెంటు, ఉచిత ఏసీ కనెక్షన్ ఏర్పాటు చేసిందన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ ను లక్ష నుండి పది లక్షలకు పెంచామని, ఉన్నత చదువులు చదివే కార్మికుల పిల్లలకు సింగరేణి సంస్థ ఫీజులు చెల్లిస్తుందని వివరించారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ అమలు జరిపామని, దేశంలో మరే ఇతర బొగ్గు పరిశ్రమలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంతో 61 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సును అమలు జరుపుతున్నామన్నారు. ఈ విధంగా దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని సంక్షేమ పథకాలు సింగరేణి సంస్థలో అమలు అవుతున్నాయని, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన విద్యుత్తును అందించడంలో సింగరేణి సంస్థ తనవంతుగా రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందించటమే కాక సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్ కూడా అందిస్తోందన్నారు. రాష్ట్ర పరిధిలో సింగరేణి భాగస్వామ్యం కావడం సింగరేణియులకు ఎంతో ఆనందకరమన్నారు. దేశంలో చివరిగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందని అలాగే సింగరేణి సంస్థ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

100 మిలియన్ టన్నుల బొగ్గు, 4 వేల మెగావాట్ల విద్యుత్తు మా లక్ష్యం
రానున్న ఐదు సంవత్సరాలలో సింగరేణి సంస్థ ప్రస్తుతం 67 మిలియన్ టన్నుల నుండి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకుపోతోందని, దీనికోసం 8 కొత్త గనుల ప్రారంభిస్తుందన్నారు. అలాగే ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 వేల మెగావాట్లకు పెంచేలా థర్మల్, సోలార్ విద్యుత్ కేంద్రాలను ప్రారంభించబోతున్నామన్నారు. తద్వారా ప్రస్తుత 32 వేల కోట్ల టర్నోవర్ 50 వేల కోట్లకు చేరుకుంటుందని, ఈ దిశగా కార్మికులు అధికారులు సమిష్టిగా అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఈ అండ్ ఎం డి. సత్యనారాయణ రావు, అడ్వైజర్ మైనింగ్
డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్
ఎం. సురేష్, అడ్వైజర్ లా లక్ష్మణరావు, అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ ఎన్.వి. రాజశేఖర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ వివిధ విభాగాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు