విజయనగరం,నవంబర్13(జనంసాక్షి): తోటపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో పార్వతిపురం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా మంగళవారం ధర్నా నిర్వహించారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం ఆర్డీఒ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, నిర్వాసితుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తదితర డిమాండ్లతో నినాదాలు చేశారు. ఈ ధర్నాలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మూడడ్ల కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, నిర్వాసిత సంఘం నాయకులు పాల్గొన్నారు.




