Sunday, 8 November 2026

త్రిబుల్ ఆర్ బాధితుల రాస్తారోకో.. పోలీసులతో వాగ్వాదం.

త్రిబుల్ ఆర్ బాధితుల రాస్తారోకో.. పోలీసులతో వాగ్వాదం.

జనం సాక్షి, డిసెంబర్ 22,భువనగిరి(ఆర్. సీ) ;

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి గుండా వెళ్లే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు గురువారం భూమి సర్వే చేపట్టారు. కాగా రాయగిరి గ్రామస్థులు అధికారులు, పోలీసుల తో వాగ్వాదానికి దిగారు. తమ కు నష్టపరిహారం చెల్లించకుండా సర్వే చేపట్టడం సరికాదని భూములు కోల్పోతున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారి నిర్మాణం లో, బస్వాపురం ప్రాజెక్టు కాల్వల నిర్మాణంలో, విద్యుత్ హై టెక్షన్ స్తంభాల నిర్మాణం లో భాగంగా రాయగిరి రైతులు భూములు కోల్పోయారని మరో సారి రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం పేరుతో భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్దీ పాటి భూమిని లాక్కుంటే తాము ఏమి చేసి బతకాలని మహిళలు కన్నీటిపర్యంత మయ్యారు. ఉదయమే కొంత మంది రైతులను అరెస్ట్ చేసి భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయగిరిలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అధికారుల భూ సర్వే నేపధ్యం లో గ్రామం వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతుంది. ఉదయాన్నే కొంత మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా సర్వే కి వ్యతిరేకంగా జాతీయ రహదారి పక్కన బైఠాయించి రైతులు, మహిళా రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులను, మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో మహిళా కానిస్టేబుళ్ల కు రాయగిరి మహిళా రైతుల కు మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని బలవంతంగా పోలీస్ వాహనంలో స్టేషన్ కి తరలించారు.