జనంసాక్షి, మంథని :వర్షాలు పడే సూచనలు ఉన్నందున వరి ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా సహకార అధికారి మైఖల్ బోస్ అన్నారు. గురువారం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని మంథని ఏఎంసి, గోపాల్ పూర్, చిన్న ఓదాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి జిల్లా సహకార అధికారి మైఖల్ బోస్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సహకార అధికారి మైఖల్ బోస్ మాట్లాడుతూ, వర్షాకాలం సమీపిస్తున్నందున వరి ధాన్యం కొనుగోళ్లను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలోనే అత్యధికంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న సంఘం మంథని కావడంతో ఇక్కడి ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు ఆయన తెలిపారు. అలాగే కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు ధాన్యం వెనువెంటనే తూకం వేస్తూ రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ట్యాబ్ ఆపరేటర్లు కూడా వెనువెంటనే ధాన్యం కొనుగోలు, ట్రాన్స్పోర్టు వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలని సూచించారు. డిసిఓ వెంట సహకార శాఖ మానిటరింగ్ అధికారి ముఫాసిర్ అహ్మద్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ ఉన్నారు.
త్వరితగతిన వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి – వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి




