Thursday, 5 November 2026

దరఖాస్తు చేసుకోగానే.. 

రేషన్‌ కార్డు, బియ్యం
– బయోమెట్రిక్‌ పనిచేయకుంటే మాన్యువల్‌, ఐరిషత్‌తో సరుకులు
– ఆగస్టు 15 తర్వాత ఈ విధానం అమల్లోకి
– 36లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం
– కల్తీపై ఉక్కుపాదం మోపుతాం
– పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
హైదరాబాద్‌, జులై17(జ‌నం సాక్షి) : దరఖాస్తు చేసుకోగానే ఎప్పుడంటే అప్పుడు రేషన్‌ కార్డు ఇచ్చి , బియ్యం అందించేలా ప్రయత్నం చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు.  హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీలో పౌర సరఫరాలు, తూనికలు-కొలతల శాఖపై మంగళవారం మంత్రి ఈటల రాజేందర్‌ సవిూక్ష నిర్వహించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి, కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 31 జిల్లాల తూనికలు-కొలతల శాఖ అధికారులకు ల్యాప్‌ టాప్‌ లు,  వాహనాలను మంత్రి ఈటల అందజేశారు. రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ పనిచేయకపోతే మాన్యువల్‌ గా, లేకుంటే ఐరిష్‌ తో వినియోగదారులకు సరుకులు ఇవ్వాలని మంత్రి ఈటల చెప్పారు. ఆగస్టు 15 తర్వాత ఈ విధానం అమలులోకి తీసుకువస్తామన్నారు. పౌర సరఫరాల సంస్థ లాభదాయకమైనది కాదని, సమాజ సేవలో ముందుంటుందని మంత్రి రాజేందర్‌ చెప్పారు. తమ శాఖ పేద ప్రజల కోసం పని చేస్తుందన్నారు. సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ రైతులు పండించిన ప్రతి కిలో వడ్లు కొని ఇబ్బంది లేకుండా చూసిందన్నారు. 36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని, కోటి ఎకరాలలో పండిన  ధాన్యం కూడా కొని, నిల్వచేసే సామర్ధ్యం ఉందన్నారు. పేదలకు రేషన్‌ దుకాణాల ద్వారా కల్తీకి ఆస్కారం లేకుండా నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులు 2 కోట్ల 75 లక్షల మందికి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి నెల బియ్యం అందజేస్తున్నామని వివరించారు. కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి రాజేందర్‌ చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీల పైన సహితం దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. లీగల్‌ మెట్రాలజీ అధికారులు ఎన్నో దాడులు నిర్వహించారని వెల్లడించారు. మల్టీప్లెక్స్‌ మోసాలను కూడా అరికడుతున్నామని, కొలతలు తక్కువగా ఇచ్చే సంస్థలపై కేసులు నమోదు చేస్తున్నామని ఈటల స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదంటే ఎలా పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ధరలో తేడా వచ్చినా ఉక్కుపాదం మోపుతున్నామని వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.