Wednesday, 4 November 2026

దళితుల సంక్షేమంలో గతంలో కన్నా మెరుగైన చర్యలు

ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు

సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర చర్చకు సిద్దం

కాంగ్రెస్‌ హయాంలోనే నిధుల దారిమళ్లింపు

అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ) నిధులు పక్కదారి పట్టలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్న సీఎం.. వారి అభివృద్ధికి ఖర్చు చేసిన వ్యయ రికార్డులను పెన్‌డ్రైవ్‌లో సభ్యులకు అందజేసినట్లు సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చట్టం వేసిందని అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రెండు రోజులు కచ్చితంగా చర్చ చేపడుదామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిపై వ్యయంపై సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపు రూ. 88 వేల 71 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 33 వేల 462 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ప్రగతి పద్దు కింద ఎస్సీల అభివృద్ధికి అధికంగానే ఖర్చు చేశామన్నారు. ఎస్సీ ప్రత్యేక నిధి కింద రూ. 14,375.13 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ. 5,475.02 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక ఎస్టీ ప్రత్యేక నిధి కింద రూ. 8,165.87 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ. 3,359.37 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని లక్ష పేజీల్లో పొందుపరిచామని సీఎం చెప్పారు. నిధుల ఖర్చులో అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే.. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్‌ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు. లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ప్రగతి పద్దు ఖర్చులపై మూడు రోజులైనా చర్చిద్దాం.. స్పష్టత తీసుకొద్దామన్నారు సీఎం కేసీఆర్‌. నిధుల విడుదలలో అలసత్వం ఉంటే వెంటనే తేల్చేద్దామన్నారు. అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతి పద్దుకు బ్జడెట్‌లో రూ.81వేల 072కోట్లు పెట్టుకున్నామన్నారు. వీటిలో రూ.33వేల 400 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. తానే స్వయంగా ప్రతీ పైసా లెక్కలు చూసుకుంటున్నాను అన్నారు. నయా పైసా ఖర్చు వివరాలు సభ్యులకు అందిస్తున్నామన్నారు. పెన్‌ డ్రైవ్‌ రూపంలో ఇచ్చామని, సభ్యులు దీనిపై పూర్తి వివరాలు పొందవచ్చు అన్నారు. ఒక్క రూపాయి కూడా పక్కదోవ పట్టలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టిన మాట వాస్తవం అన్నారు. కానీ తమ ప్రభుత్వంలో అలా జరిగిందనడం అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 2,651 కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్‌ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇస్తున్నామని గుర్తు చేశారు. టీఎస్‌ప్రైడ్‌ కింద దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. వందశాతం సబ్సిడీతో ఎస్సీలకు రుణాలు ఇస్తున్నామని ప్రకటించారు. భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలోనే అమలవుతుందన్నారు. ప్రభుత్వం ఏ విషయంలోనైనా పారదర్శకంగా ఉండాలనుకుంటుంది.. కానీ పారిపోవాలనుకోవడం లేదన్నారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మూడెకరాల హావిూని విస్మరించారు

ఎన్నికల సమయంలో కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హావిూ ఇచ్చి మాట తప్పిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. చాలా మంది దళితులు మూడెకరాల భూమి కోసం ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వయంఉపాధి కింద 71వేల మందికి రుణాలు ఇచ్చినట్లు మంత్రులు చెబుతున్నారని, కాగా స్వయం ఉపాధి కోసం వేల రుణ దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. దళితుల అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని సీఎం కేసీఆర్‌ అన్నారని, కానీ దళితుల కోసం నిధులు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ 31 జిల్లాల్లో కేవలం పది జిల్లాల్లో మాత్రమే ఈ నిధుల ఖర్చు జరుగుతోందని, మిగతా జిల్లాల్లో జరగడం లేదన్నారు. నిధుల ఖర్చులో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. అయితే ఖచ్చితంగా ఎక్కడ జరగడం లేదో వివరాలు ఇవ్వాలని, అలాగాకుండా ఆరోపణలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అబ్యంతరం చెప్పారు. దళితుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. మూడున్నరేళ్లలో దళితుల కోసం రూ.6,713కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు టీఎస్‌ ప్రైడ్‌ కార్యక్రమం రూపొందించామన్నారు. దళితుల్లో పేదరికం ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దళితుల నిధులు దారి మళ్లాయని విమర్శించారు. బీసీ, ఓసీ లోనూ అత్యంత వెనుకబడిన వారున్నారన్నారు.