దాచేపల్లి నిందితుడి ఆత్మహత్య
– అమరలింగేశ్వరాలయం సవిూపంలో చెట్టుకు ఉరేసుకున్న సుబ్బయ్య
– నిర్దారించిన పోలీసులు
– పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి మృతదేహం తరలింపు
గుంటూరు, మే4(జనం సాక్షి ) : దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు పరారీలో ఉన్న సుబ్బయ్య ఆచూకీ కోసం పోలీసులు 17 బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మరో వైపు డ్రోన్ కెమెరలతో కూడా కృష్ణా నది పరసర ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలించారు. ఈ క్రమంలో సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గురజాల మండలం తేలికుట్ల- దైద దగ్గరున్న అమరలింగేశ్వర దేవాలయం సవిూపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీస్ యంత్రాంగం అక్కడ వెళ్లి సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్య ఎప్పుడు చనిపోయాడనే విషయాన్ని వైద్యులు నిర్థారిస్తారని డీజీపీ మాలకొండయ్య వెల్లడించారు.
చనిపోయేముందు బంధువులకు సుబ్బయ్య ఫోన్..
అయితే సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్టు తెలిపాడు. అందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డు బయటపడింది. ఆయన ఫోన్ కాల్ సంభాషణలో ‘పదిమందికి మంచి చెప్పి బతికేవాణ్ని.. కానీ అనుకోకుండా ఘటన జరిగిపోయింది. నాకు చావడం ఒక్కటే మార్గం.. నేను
చేయకూడని పని చేశాను. నా మొహం చూపెట్టుకోలేను. నేను చేసిన పనితో నా కొడుకు పరువు పోయింది. చావడానికే వెళ్తున్నాను.’ అని సుబ్బయ్య బంధువులకు తెలిపాడు. ఎలాంటి అఘాత్యం చేసుకోవద్దని బంధువులు వారిస్తున్నా సుబ్బయ్య వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడు.