మునిపల్లి, ఏప్రిల్ 20, జనంసాక్షి : మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజానర్సింహాపై అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్ర స్థాయిలో ద్వాజమెత్తారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. గురువారం నాడు మండలం కేంద్రంలో రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమానికి హాజరు అయ్యారు. లింగంపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంటే అనుచరులతో కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే చాలా మంది రైతులకు నష్టపరిహారం చెక్కులు అందించామని చెప్పారు. జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో దాదాపు 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మంత్రి హరీష్, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఎకరాకు రూ.10 లక్షల రూపాయలు పరిహారం ఇప్పించామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుతో లింగంపల్లి రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. భూమికోల్పోయిన రైతులకు కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ యూనిట్స్ లో స్థానికంగా పండించే పంటలను కూడా కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసి మంచి ధర వచ్చిన తర్వాత అమ్ముకోవచ్చని చెప్పారు. దీనితో పాటు స్థానికంగా పండించిన పంటలను ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి, రైతులు అధిక లాభాలు పొందెందుకు అవకాశం ఉందని తెలిపారు. జెఎన్టీయూ, వట్పల్లి మార్కెట్ నిర్మాణానికి పెదరైతుల నుంచి భూములు లాక్కున్న చరిత్ర కాంగ్రెస్ నాయకులది కదా అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేఖనే దామోదర్ రాజానర్సింహా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లింగంపల్లి గ్రామానికి చెందిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. లింగంపల్లి, పిల్లోడి గ్రామాలకు చెందిన యువకులను బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత ఈ నెల 28న సంగమేశ్వర పథకం పనులు శంకుస్థాపనకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. మునిపల్లి సర్పంచ్ ఏర్పాటు చేసిన ఇప్తార్ వింధు కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మీనాక్షి, తహసీల్దార్ శివకుమార్, ఎంపీడీఓ అంజనీదేవి, బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు రాహుల్ కిరణ్ చంటి, మఠం బిక్షపతి, పైతర సాయికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజినీకాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వారణాసి సతీష్, ప్రధాన కార్యదర్శి మంతురి శశికుమార్, యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు, సీనియర్ నాయకులు అల్లం నావాజ్ రెడ్డి, రాంచందర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




