Monday, 2 November 2026

దుబ్బాకలో వేడెక్కుతున్న రాజకీయం

పోటీపోటీగా కాంగ్రెస్‌, బిజెపి నేతల ప్రచారం
గెలుపు లక్ష్యంగా ఇరు పార్టీల నేతల మొహరింపు
సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ వేడి   పెరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రచారంతో ¬రెత్తిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు  కోసం కాంగ్రెస్‌ పార్టీ  అష్టకష్టాలు పడుతోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. దుబ్బాకలో గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి తప్పనిసరి అయింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తే ఇన్నాళ్లు ప్రభుత్వంపై కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్‌ పడనుంది. తమ పార్టీ గెలిస్తే త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌,బిజెపి  పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ విజయం క్యాడర్‌కు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు ఉత్సాహాన్ని నింపుతుందనుకుంటున్నారు. ఒకవేళ దుబ్బాకలో బీజేపీ విజయం కైవసం చేసుకుంటే అధికార పార్టీకి ప్రమాద ఘంటికలు మోగడంతో పాటు.. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్న ప్రచారం చేస్తుంది. అలాగే కాంగ్రెస్‌ పని అయిపోయిందని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాలని రాష్ట్ర నాయత్వం పనిచేస్తోంది. అలాగే బిజెపి కూడా అదే పనిలో ఉంది. అందుకే బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు తమ నాయకులను గడిచిన నెలరోజులుగా గ్రామాల్లో మొహరించి ప్రచారంలో దూకుడు పెంచాయి.  పార్టీల ముఖ్య నేతలు ప్రతి ఓటరును కలిసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారాన్ని గ్రామస్థాయికి, బూత్‌ స్థాయికి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌ బాబులు పని చేస్తున్నారు. వారందిరికీ  ఒక్కో పోలింగ్‌ బూత్‌ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. అక్కడ ఓట్లు తక్కువ వస్తే ఆ నాయకుడే బాధ్యతవహించాల్సి ఉంటుందని హెచ్చరించారని కూడా సమాచారం. అలాగే బిజెపి నేతలు బండి సంజయ్‌, వివేక్‌, ధర్మపురి అర్వింద్‌, డికె అరుణ, జితేందర్‌ రెడ్డి, మోత్కుపల్లి తదితరులు కూడా ఊరూవాడా చుట్టివచ్చి ప్రచారం చేస్తున్నారు.  ఇలా నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక నాయకుడిని నియమించారు. తమ పరిధిలో సరైన ఓట్లు రాకపోతే ఎక్కడ పరువుపోతుందోనని తామే ఎన్నికల బరిలో దిగినట్లుగా ప్రచారాన్ని ¬రెత్తిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర అగ్రనాయకులు, ప్రజాకర్షణ ఉన్న నేతలు దుబ్బాక నియోజకవర్గంలోని ఊరూరు చుట్టేస్తున్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌, భట్టి, వీహెచ్‌, దామోదర రాజనరసింహా లాంటి నేతలంతా టీఆర్‌ఎస్‌, బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ముత్యం శ్రీనివాసరెడ్డి తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తమకు ప్లస్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముత్యంరెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడేవారని రాజకీయపార్టీలకతీతంగా అందరూ అంగీకరిస్తారు. గతంలో కేసీఆర్‌, ముత్యంరెడ్డి మంత్రులుగా పనిచేసిన సమయంలో సిద్దిపేటలో కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధికి పోటీగా దుబ్బాకలో పనులు చేపట్టేవారని చెబుతారు. నిధుల విషయంలోనూ, అభివృద్ధి పనుల విషయంలోనూ ఇద్దరి మధ్య పోటీ ఉండేదంటారు. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్‌, సిద్దిపేట స్థాయిలో దుబ్బాకను అభివృద్ధి చేయలేదనే ప్రచారాన్ని కాంగ్రెస్‌ నేతలు ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తున్నారు. ముత్యంరెడ్డి పట్ల నియోజకవర్గంలో సానుకూలత.. ఆయన చనిపోయాక సానుభూతి కలిసొస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బిజెపి మాత్రం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్‌, బిజెపిలను టార్గెట్‌ చేస్తూ కేంద్రం నిధులను ప్రస్తావిస్తున్నారు. గడీల పాలనను తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నారు. మొత్తంగా రాజకీయ వేడి పుట్టి ప్రజలు తాము ఎటు వైపో చెప్పడం లేదు.