Monday, 2 November 2026

దుబ్బాక ఎన్నికకు ముందురోజే బిజెపికి షాక్‌

పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన శ్రీధర్‌ రెడ్డి

మంత్రికె టిఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్ననేత

దుబ్బాకలో విజయం టిఆర్‌ఎస్‌దే అని వెల్లడి

కెసిఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శరణ్యమని వ్యాఖ్య

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): దుబ్బాకుప ఎన్నికకు ఒకరోజు ముందే బిజెపికి ఊహించని షాక్‌

తగిలింది. అయితే బీజేపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని రచించింది. బీజేపీ రాష్ట్ర నాయకుడిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఆ పార్టీకి షాకిచ్చింది. బీజేపీ నేత రావుల శ్రీధర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో శ్రీధర్‌ రెడ్డి పార్టీలో చేరారు. రావుల శ్రీధర్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి

టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానానికి పంపారు. బీజేపీలో తాను 11 సంవత్సరాలుగా ఉన్నానని, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య దుబ్బాక యుద్ధం నడుస్తోంది. దుబ్బాక నియోజకవర్గానికి మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాకలో విజయంపై రెండు పార్టీలు ధీమాతో ఉన్నక్రమంలో శ్రీదర్‌ రెడ్డి రాజీనామాచేయడం, టిఆర్‌ఎస్‌లో చేరడంవ్యూహాత్మక రాజకయాలుగా

భావించాలి. బీజేపీ తరఫున శ్రీధర్‌రెడ్డి గొంతును వినిపిస్తుండేవారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆయన విరుచుకుపడుతుండేవారు. నిన్న మొన్నటి వరకూ దుబ్బాక ఉప ఎన్నికపై శ్రీదర్‌ మాట్లాడారు. టీవీ డిబెట్స్‌, విూడియా విూట్‌లు పెట్టి మరీ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల తీరుపై మండిపడ్డారు. అంతేకాకుండా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు డబ్బుల వ్యవహారంపై కూడా ఇటీవలే స్పందించి అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే అనూహ్యంగా ఇలా పార్టీకి రాజీనామా చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా రావుల శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు చేతిలోనే భద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన అనంతరం రావుల శ్రీధర్‌ రెడ్డి మాట్లాడారు. గత 11 సంవత్సరాల నుంచి బీజేపీలో వివిధ స్థాయిల్లో ప్రజలకు సేవలందించాను అని తెలిపారు. జూబ్లీహిల్స్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. గత రెండు సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉంటున్నాను. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాక టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో తెలంగాణతో పాటు హైదరాబాద్‌ బాగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్‌ కేసీఆర్‌ చేతిలోనే భద్రంగా ఉంటుందన్నారు. దేశంలో అగ్రగామిగా నిలవాలంటే కేసీఆర్‌ నాయకత్వం తప్పనిసరి అని రావుల శ్రీధర్‌ రెడ్డి తెలిపారు. దుబ్బాక చైతన్యవంతమైన ప్రజాక్షేత్రం. నేడు జరగబోయే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ఖాయమని శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గత ఫలితం పునరావృతం కాబోతుందన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో తనకున్న అనుభవాన్ని, శక్తియుక్తులను టీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధికి ఉపయోగిస్తాను అని స్పష్టం చేశారు. ఇరిగేషన్‌, విద్యుత్‌, ఐటీ రంగంలో తెలంగాణ మందంజలో ఉందన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్‌ వల్లే సాధ్యమవుతుందన్నారు. ఇది ప్రతి పార్టీ నాయకుడు గుర్తుంచుకోవాలన్నారు. కరోనా సమయంలోనూ ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దేవుడిలా ఆదుకున్నారు. ఇటీవల వచ్చిన వరదలకు ప్రభావితమైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు అని రావుల శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.