దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు
సంపూర్ణ అంధత్వం నివారణనే లక్ష్యంగా “కంటి వెలుగు” కార్యక్రమం అమలు
“కంటి వెలుగు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (19): ప్రభుత్వం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా “కంటి వెలుగు” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.గురువారం గోపాల్ పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “కంటి వెలుగు” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మి న్ బాషాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం సంపూర్ణ అంధత్వం నివారణకు కృషి చేస్తున్నదని, ప్రతి ఒక్కరూ ఇందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్ఠికాహారం అందించినట్లైతే పుట్టబోయే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని, పౌష్టికాహార లోపంతో దృష్టి సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ, ప్రజా ప్రతినిధుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. జిల్లాలో 18 సం.లు నిండిన వారు 4 లక్షల 52 వేల మంది ఉన్నారని, 255 గ్రామ పంచాయతీలలో, 80 మునిసిపాలిటీ వార్డులలో కంటి పరీక్షలు నిర్వహించేందుకు 28 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు నిర్వహించటం జరుగుతుందని, ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాలలో 300, పట్టణ ప్రాంతాలలో 400 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని మంతి తెలిపారు. పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో 100 శాతం ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.ఒక టీమ్ లో 15 మంది సభ్యులు ఉంటారని, ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఎ.ఎన్.ఎం.లు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. శిబిరాలకు వచ్చే వారికి అవసరమైన త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వారంలో 5 రోజులు పని దినాలు వుంటాయని, శని, ఆది వారాల్లో, ప్రత్యేక పండగలకు కంటి పరీక్షలు నిర్వహించబోమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.జిల్లాలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం రీడింగ్ అద్దాలను అందించటం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో 24 వేల 537 రీడింగ్ అద్దాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రిస్క్రైబ్ డ్ అద్దాలను వారం రోజులలో ఆశ, అంగన్వాడి కార్యకర్తలచే వారి ఇంటి వద్దకే అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ దృష్టి లోపంతో ఎవరు ఇబ్బందులు ఎదుర్కోవద్దని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చూపు మందగించిన వారికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అద్దాలను అందించటం జరుగుతుందని ఆమె సూచించారు. వారి వివరాలను కంప్యూటర్ లో నమోదు చేయటం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ, ఎ. ఎన్.ఎం. లతో అవగాహన బృందాలను ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ బృందాల ద్వారా ఇంటింటికి వెళ్లి కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారని ఆమె సూచించారు. కంటి పరీక్షలు నిర్వహించిన వెంటనే రీడింగ్ అద్దాలను అందించటం జరుగుతుందని, ప్టిస్క్రి బ్ద్ అద్దాలను వారం రోజుల్లో అందించటం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య తిరుపతయ్య యాదవ్ , జెడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ , కోఆప్షన్ సభ్యులు మతిన్ , గోపాల్ పేట్ సర్పంచ్ పొడవు శ్రీనివాసులు, బిఆర్ఎస్ నాయకులు కోదండం, భాస్కర్, డి.ఎం.హెచ్. ఓ. రవిశంకర్ ప్రోగ్రామింగ్ అధికారి (ఎ. ఓ) సాయినాథ్, మెడికల్ ఆఫీసర్ లు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఎ.ఎన్.ఎం.లు, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




